: మరణానంతరం నేతాజీకి పెట్టిన పేరు ఇచిరో ఒకురా... తైపీలో అంత్యక్రియలు!


నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యం మిస్టరీ గురించిన సస్పెన్స్ దాదాపు వీడిపోయింది. ఆయన విమాన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారని ఇప్పటికే ఆయన బంధువులు అంగీకరించగా, తాజాగా అందుకు సంబంధించిన మరింత సమాచారం వెలువడింది. 1945, ఆగస్టు 22న తైపీలో నేతాజీ మృతదేహానికి అంతిమ సంస్కారం జరిగిందని, అంతకుముందు ఆయన పేరును ఇచిరో ఒకురాగా పేర్కొంటూ డెత్ సర్టిఫికెట్ జారీ అయిందని, అప్పటి తైపీ అధికారి టాన్ టిటి చెప్పినట్టున్న కొన్ని పత్రాలు 'బోస్ ఫైల్స్' వెబ్ సైట్ పేర్కొంది. ఆగస్టు 18న విమాన ప్రమాదం జరిగిందని, భారత నాయకుడు బోస్ ఓ ముఖ్యమైన పనిమీద టోక్యో వెళుతూ, తీవ్రంగా గాయపడి మరణించారని టాన్ వాగ్మూలం ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో కుటుంబ సభ్యులు దగ్గర్లేనప్పుడు సైనిక ఆసుపత్రిలో ఇచ్చే డెత్ సర్టిఫికెట్ ఆధారంగా దహన సంస్కారాలకు అనుమతి ఇచ్చామని ఆప్పటి తైవాన్ సర్కారు తన రిపోర్టులో వెల్లడించింది. అంత్యక్రియల మరుసటి రోజే జపాన్ సైన్యాధికారి, బోస్ మృతదేహంతో వచ్చిన ఇండియన్ (కల్నల్ హబీబుర్ రెహ్మాన్ గా భావన) ఆయన అస్థికలు తీసుకువెళ్లారని టాన్ తెలిపారు. కాగా, ఈ పత్రాలను తాము అసలైనవనే నమ్ముతున్నట్టు నేతాజీ కుమార్తె అనితా ఫాప్ తెలిపారు. ఈ నెల 23న బోస్ కు సంబంధించి ఇండియా వద్ద ఉన్న మరికొన్ని రహస్య పత్రాలను ప్రధాని స్వయంగా బహిర్గతం చేయనున్నారు.

  • Loading...

More Telugu News