: మోదీ, హోలాండేలపై ఐఎస్ గురి?... ఢిల్లీలో మరింత పెరిగిన భద్రత
భారత 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే హాజరవుతున్నారు. ఇప్పటికే ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ సహా ప్రపంచంలోని పలు దేశాలపై దాడులకు దిగిన కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్... తాజాగా ఢిల్లీ వేదికగా జరగనున్న గణతంత్ర దినోత్సవ వేడుకలపైనా విరుచుకుపడేందుకు ప్రణాళికలు రచించిందట. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోలాండేలను లక్ష్యంగా చేసుకుని ఆ సంస్థ ముష్కరులు దాడులకు వ్యూహాలు రచించారు. ఈ మేరకు భారత నిఘా వర్గాలకు విశ్వసనీయ సమాచారం అందింది. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలతో ప్రస్తుతం ఢిల్లీలో భద్రత భారీ స్థాయిలో పెరిగింది. ఢిల్లీ పోలీసు శాఖకు చెందిన 80 వేల మంది పోలీసు బలగాలకు తోడుగా మరో 10 వేల మంది పారా మిలటరీ బలగాలు కూడా రంగంలోకి దిగాయి. గణతంత్ర దినోత్సవం నాడు మరింత మంది పోలీసు బలగాలను రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది.