: టీఆర్ఎస్ ను ఓడించే సత్తా టీడీపీ-బీజేపీకే ఉంది: కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజకీయాలు చేయడానికే హైదరాబాద్ కు వచ్చారని బీజేపీ నేత కిషన్ రెడ్డి ఆరోపించారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, రాహుల్ మిడి మిడిమిడి జ్ఞానంతో రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. దేశాన్ని దివాళా తీయించిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో జీఎస్టీ బిల్లు ఆమోదం పొందకుండా కావాలనే అడ్డుకుంటోందని విమర్శించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ‘అసహనం’ పేరుతో బీజేపీపై కుట్ర చేసి ఓడించారని, అదేమాదిరి ఎత్తుగడ జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పన్నుతున్నారని అన్నారు. సెంట్రల్ యూనివర్శిటీలో పీహెచ్ డి విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అభ్యర్థులకు బీ-ఫారాలు, తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర, భారత విద్యా వ్యవస్థలో మార్పులు తదితర అంశాలపై ఆయన మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పొత్తు ధర్మంలో భాగంగా కొన్నిచోట్ల సీట్లు ఇవ్వాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని కార్యకర్తలు అర్థం చేసుకుంటారని తాను భావిస్తున్నానని అన్నారు. టీఆర్ఎస్ ను ఓడించే సత్తా టీడీపీ-బీజేపీ కూటమికే ఉందని, సబ్ కే సాత్..సబ్ కా వికాస్ అనేది బీజేపీ నినాదమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.