: సెక్యూరిటీ థ్రెడ్ లేని రూ. 1000 నోట్లపై ఆర్బీఐ మార్గనిర్దేశకాలు
సెక్యూరిటీ థ్రెడ్ లేకుండా ఉన్న వెయ్యి రూపాయల నోట్లు చెలామణిలో ఉన్నాయని, వాటిని దుకాణదారులు తీసుకోవడం లేదని లెక్కకు మిక్కిలిగా ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ స్పందించింది. ఇకపై బ్యాంకులు సెక్యూరిటీ థ్రెడ్ లేని రూ. 1000 నోట్లను నగదు విత్ డ్రా చేసుకునే ఖాతాదారులకు ఇవ్వరాదని అన్ని బ్యాంకులనూ ఆదేశించింది. "రూ. 1000 నోట్లపై ఈ థ్రెడ్ లేదని చాలా ఫిర్యాదులు అందాయి. నాసిక్ లోని ముద్రణాలయంలో ఇవి ముద్రించబడ్డాయి. వీటిని గమనిస్తే ఖాతాదారులకు ఇవ్వరాదని ఆదేశాలు జారీచేశాము" అని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఈ తరహా నోట్లు బ్యాంకుకు వస్తే, వాటిని స్వీకరించాలని బ్యాంకులకు సూచించినట్టు ఆయన తెలిపారు. ఈ తరహా నోట్లు 500 వరకూ మార్కెట్లో ఉన్నాయని, వీటి విలువ రూ. 5 లక్షలు మాత్రమేనని ఆయన అన్నారు. ముద్రణాలోపాల కారణంగా ఇవి బయటకు వచ్చాయని, వీటిని అందుకున్న ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన వివరించారు.