: 60 ఏళ్ల సేవలకిక విశ్రాంతి... తుది ప్రయాణాన్ని ప్రారంభించిన ఐఎన్ఎస్ విరాట్
మహాసముద్ర జలాల్లో నిత్యమూ తిరుగుతూ, ఆరు దశాబ్దాలుగా సేవలందిస్తూ, గత 30 ఏళ్లుగా భారత దేశాన్ని రక్షిస్తూ వచ్చిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విరాట్ తన తుది ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 1200 మంది నౌకాదళ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ప్రయాణిస్తుండే ఐఎన్ఎస్ విరాట్ ఈ సంవత్సరం లో రిటైర్ కానున్న నేపథ్యంలో తుది ప్రయాణంగా ముంబై నుంచి విశాఖపట్నానికి బయలుదేరింది. వచ్చే నెలలో రాష్ట్రపతి ప్రణబ్, ప్రధాని మోదీ సహా వివిధ దేశాల ప్రతినిధుల మధ్య జరిగే 50 దేశాల నౌకాదళ విన్యాసాల్లో పాల్గొన్న తరువాత ఐఎన్ఎస్ విరాట్ సుదీర్ఘ సేవల నుంచి విశ్రాంతి పొందనుంది. ఇండియాకు 1987 మే 12న చేరిన ఈ నౌక, అంతకుముందు అర్జెంటీనా యుద్ధంలో, దానికన్నా ముందు హెచఎంఎస్ హెర్మ్స్ పేరుతో రాయల్ నేవీకి సేవలందించింది. ఆరు సీ హారియర్ ఫైటర్ జట్ విమానాలు, చేతక్, సీ కింగ్ యాంటీ-సబ్ మెరైన్ యుద్ధ హెలికాప్టర్లతో పూర్తి స్థాయి ఆయుధాలతో ఈ యుద్ధ నౌక విశాఖ చేరి, విన్యాసాల్లో ప్రధాన భూమికను పోషించనుందని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 4కల్లా ఐఎన్ఎస్ విరాట్ విశాఖ చేరుతుందని, విన్యాసాల అనంతరం తిరిగి ముంబై వెళుతుందని వివరించారు. కాగా, ఇప్పటికే ఈ యుద్ధ నౌకను రూ. 1 చెల్లించి ఏదైనా తీర ప్రాంత రాష్ట్రం కొనుగోలు చేసి తేలియాడే మ్యూజియంగా ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే, అప్పగిస్తామని కేంద్రం నుంచి పలు రాష్ట్రాలకు లేఖలు అందాయి. అయితే, దీని వార్షిక నిర్వహణకు రూ. 300 కోట్లు ఖర్చువుతుందన్న అంచనాలు ఉండటంతో, ఇప్పటివరకూ ఏ రాష్ట్రమూ దీన్ని తీసుకునేందుకు ముందుకు రాలేదని సమాచారం. కాగా, విశాఖలో జరిగి నౌకాదళ విన్యాసాల్లో 50 దేశాలకు చెందిన 100కు పైగా నౌకలు విన్యాసాల్లో పాల్గొననున్నాయి.