: ఇరాక్ హృదయాన్ని పాట ద్వారా ఆవిష్కరిస్తున్న 'బాబిలోన్ ప్రిన్సెస్'!
ఇరాక్ అంటే మనకు కేవలం యుద్ధమే జ్ఞప్తికి వస్తుంది. కానీ, అక్కడ ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయని మిర్నా హనా (11) అనే బాలిక పేర్కొంటోంది. 'ది వాయిస్ కిడ్స్' అనే రియాలిటీ షోలో ఆడిషన్ లో పాల్గొన్న మిర్నాహనా 'ఎస్టర్ డే ఇన్ ఏ డ్రీమ్' అంటూ పాడిన ఇరాకీ ప్రేమ గీతానికి విశేషమైన ఆదరణ లభిస్తోంది. ఈ పాటను యూట్యూబ్ లో పెట్టగా ఇప్పటివరకు ఈ పాటను కోటీ 18 లక్షల సార్లు వీక్షించారు. ఈ పాటను తన్మయత్వంతో విన్న ఈ షో జడ్జ్ లు బాలికను 'బాబిలోన్ ప్రిన్సెస్' అని ప్రశంసించారు. పాప గొంతుకు ముగ్ధులైన నిర్వాహకులు మరోపాట పాడమని కోరారు. దీంతో ప్రోజెన్ సినిమాలోని 'లెట్ ఇట్ గో' పాట పాడింది. దీంతో స్టేడియం హోరెత్తిపోయింది. ఈ సందర్భంగా ఇరాక్ లోని క్రిస్టియన్ కుటుంబానికి చెందిన మిర్నా హనా గురించి తెలుసుకున్న జడ్జ్ లు షాక్ కు గురయ్యారు. ఇరాక్ లోని ఇంట్లో ఉండగా, తనను కిడ్నాప్ చేసి, హత్యచేయాలని ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు భావించారని తన తండ్రి చెప్పగానే షాక్ గురయ్యానని చెప్పింది. ఇప్పటికీ తాను ఒంటరిగా పడుకోలేనని హనా చెప్పింది. పాడడానికే తన గొంతు ఉందని, ఇరాక్ అంటే యుద్ధం మాత్రమే కాదని, ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయని చెప్పి అందరితో ప్రశంసలు అందుకుంది. అనంతరం ఆమె తండ్రి మాట్లాడుతూ, ఓ రోజు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల నుంచి తన కుమార్తెను కిడ్నాప్ చేసి హత్య చేస్తారంటూ సమాచారం అందిందని తెలిపారు. వెంటనే ఇంకేం ఆలోచించకుండా చేస్తున్న ఉద్యోగం, కట్టుకున్న ఇళ్లు, ఆస్తిపాస్తులు అన్నీ వదిలేసి, కట్టుబట్టలతో లెబనాన్ వచ్చినట్టు తెలిపారు. లెబనాన్ రాజధాని బీరూట్ లో ఆయన ఇప్పుడు నివాసం ఉంటున్నారు.