: సెంచరీలతో కదంతొక్కిన ధావన్, కోహ్లీ
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఇన్నింగ్స్ ను ధాటిగా ప్రారంభించాడు. ఇప్పటికే సిరీస్ కోల్పోయి పరువు కోసం పోరాడుతున్న టీమిండియాలో ఆత్మవిశ్వాసం నింపే ఆటతీరుతో శిఖర్ ధావన్ ఆకట్టుకున్నాడు. రోహిత్ శర్మ (41)తో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన ధావన్ ఆసీస్ పదునైన బౌలింగ్ కు బలమైన షాట్లతో సమాధానం చెబుతున్నాడు. దూకుడుగా ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ పెవిలియన్ చేరడంతో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి ఆచితూచి ఆడుతున్న ధావన్ గతి తప్పిన బంతులను బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలో కేవలం 92 బంతుల్లో 12 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ చేశాడు. ఇక సిరీస్ లో నిలకడ ప్రదర్శిస్తున్న కోహ్లీ మరోసారి సత్తా చాటాడు. ఈ క్రమంలో కేవలం 84 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇద్దరు టీమిండియన్లు సెంచరీలతో రాణించడంతో కేవలం ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా 36 ఓవర్లకు 265 పరుగులు చేసింది. ధావన్ (115), కోహ్లీ (103) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో రిచర్డ్ సన్ ఒక వికెట్ తీసి రాణించాడు.