: హెచ్ సీయూ వీసీ 2002లోనూ 12 మంది దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారట!
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్య కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య అప్పారావును కూడా చిక్కుల్లో పడేసిందనే చెప్పాలి. వర్సిటీలో ఏబీవీపీ, అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ నేతల మధ్య చోటుచేసుకున్న ఘర్షణల నేపథ్యంలో మొన్న ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేములతో పాటు మరో నలుగురు విద్యార్థులను అప్పారావు సస్పెండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు అప్పారావు కారణమయ్యారని ఆరోపించిన విద్యార్థులు, తక్షణమే ఆయనను వీసీ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా దళిత విద్యార్థులపై సస్పెన్షన్ అస్త్రం ప్రయోగించడంలో అప్పారావు సిద్ధహస్తుడేనన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు వర్సిటీ రీసెర్చి స్కాలర్, అంబేద్కర్ స్టూడెంట్ యూనియన్ నేత కృష్ణా నాయక్ ను ఊటంకిస్తూ ప్రముఖ ఇంగ్లీష్ డైలీ ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ తన వెబ్ సైట్ లో ఓ కథనాన్ని రాసింది. ఆ కథనం వివరాలిలా ఉన్నాయి. 2001 నుంచి 2004 వరకు అప్పారావు వర్సిటీలోని హాస్టల్ కు చీఫ్ వార్డెన్ గా పనిచేశారు. ఆ సమయంలో హాస్టల్ విద్యార్థులను మాంసాహారులు, శాకాహారులుగా అప్పారావు విభజించారు. దళితులు, దళితేతరులు అన్న విభజనను విద్యార్థుల మధ్య తీసుకొచ్చారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేసిన దళిత విద్యార్థులు 2002లో నిబంధనల ప్రకారం అనుమతి తీసుకుని ఆయనను కలిశారు. ఈ సందర్భంగా విద్యార్థులపై దురుసుగా వ్యవహరించిన అప్పారావు, ఓ విద్యార్థి కాలర్ కూడా పట్టుకున్నారు. ఈ క్రమంలో అప్పారావుకు మద్దతుగా అక్కడ ఉన్న మరికొంత మంది, విద్యార్థుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడులు స్వల్ప మోతాదులోనే జరిగినా, ఇద్దరికి గాయాలయ్యాయి. దీనిపై విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అప్పారావు 12 మంది దళిత విద్యార్థులను సస్పెండ్ చేశారు. దీనిపై విద్యార్థులు కోర్టుకెళ్లగా, వారి పిటిషన్ ను నాడు కోర్టు కొట్టేసింది.