: లేట్ నైట్ లో మద్యం ఇవ్వలేదని బార్ సిబ్బందిపై కేంద్రమంత్రి మేనల్లుడి దాడి... కేసు నమోదు


కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు తన సొంతూరు బెంగళూరులో ఇక్కట్లు తప్పడం లేదు. గతంలో ఆయన కుమారుడు కార్తీక్ గౌడ తనను రహస్య వివాహం చేసుకున్నాడని ఆరోపిస్తూ కన్నడ సినీ నటి మైత్రేయి సంచలన ఆరోపణ చేసిన సంగతి తెలిసిందే. కార్తీక్ వివాహానికి ముందు ఆమె చేసిన ఆరోపణలు పెను సంచలనం రేపాయి. ఆ సమస్య నుంచి సదానంద గౌడ కుటుంబం బయటపడేందుకు చాలాకాలమే పట్టింది. తాజాగా ఆయన మేనల్లుడి వంతు వచ్చింది. నిర్ణీత సమయం ముగిసిన తర్వాత లేట్ నైట్ లో మద్యం సరఫరా చేయలేదన్న కారణంగా ఓ బార్ బౌన్సర్లపై సదానంద గౌడ మేనల్లుడు అభిషేక్, అతడి మిత్రుడు హితేశ్ లు పిడి గుద్దులు కురిపించారు. ఈ నెల 2న జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం బయటకు వచ్చింది. మిత్రులతో కలిసి ఈ నెల 2న బెంగళూరులోని జేపీ నగర్ లో ఉన్న ‘అండర్ డాగ్స్ స్పోర్ట్స్ బార్ అండ్ గ్రిల్’కు వచ్చిన అభిషేక్ రాత్రి 11 గంటలదాకా మద్యం తాగాడు. అయితే 11 గంటలకు బార్ మూయాల్సి ఉన్న సమయంలో కూడా అతడు మద్యం కోసం ఆర్డర్ ఇచ్చాడు. బార్ మూస్తున్నామని, మద్యం సరఫరా కుదరదని బార్ యాజమాన్యం చెప్పింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభిషేక్, హితేశ్ లు బార్ బౌన్సర్లపై దాడికి దిగారు. దీనిపై బార్ మేనేజర్ అనిల్ గౌడ్ జేపీ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన నిన్నటిదాకా వెలుగుచూడనప్పటికీ, అభిషేక్ దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీ చిక్కడంతో ఈ ఘటనపై ‘ద న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ నేటి తన సంచికలో ప్రత్యేక కథనం రాసింది.

  • Loading...

More Telugu News