: ‘జిహాదీ జాన్’ మరణించాడు... అధికారికంగా ప్రకటించిన ఐఎస్


పాశ్చాత్య దేశాలకు చెందిన వారిని పీకలు కోసి మరీ చంపేసి, ఆ దారుణ మారణకాండను చిత్రీకరించిన వీడియోలను ఆన్ లైన్ లో పెట్టి ప్రపంచాన్ని భయభ్రాంతులకు గురి చేసిన ‘జిహాదీ జాన్’ చనిపోయాడు. వైమానిక దాడుల్లో భాగంగా అతడు ప్రయాణిస్తున్న కారు ముక్కలైపోయింది. గత నవంబర్ లోనే జరిగిన ఈ ఘటనలో కారుతో పాటు జిహాదీ జాన్ శరీరం కూడా ఛిద్రమైపోయింది. ఈ మేరకు అతడు పనిచేసిన ప్రపంచ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ అధికారికంగా ప్రకటించింది. బ్రిటిష్ కు చెందిన మొహ్మద్ ఎమ్వాజీ ఐఎస్ లో చేరిన తర్వాత దారుణ మారణ కాండ సృష్టించాడు. ఐఎస్ అపహరించిన పాశ్చాత్య దేశాలకు చెందిన వ్యక్తులను ఎమ్వాజీ గొంతులు కోసి మరీ హత్య చేశాడు. సదరు దారుణాలను వీడియోలో చిత్రీకరించి, వాటిని ఆన్ లైన్ లో పోస్ట్ చేసిన ఐఎస్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ముఖానికి ముసుగేసుకుని అతడు చేసిన ఈ దారుణాలతోనే ఐఎస్... కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థగా పేరుగాంచింది. ‘‘నవంబర్ 12న మానవ రహిత విమానాలు సిరియాలోని రఖాపై బాంబుల వర్షం కురిపించాయి. ఈ దాడుల సమయంలో జిహాదీ జాన్ ప్రయాణిస్తున్న కారుపై కూడా ఆ బాంబులు పడ్డాయి. ఈ దాడుల్లోనే జిహాదీ జాన్ చనిపోయాడు’’ అని ఐఎస్ కు చెందిన ఆన్ లైన్ మేగజీన్ ‘దాబిక్’ పేర్కొంది. ఈ మేరకు నిన్న ఆ మేగజీన్ లో ఐఎస్... జిహాదీ జాన్ మరణాన్ని ధ్రువీకరించింది.

  • Loading...

More Telugu News