: హెచ్ సీయూ ఘటనకు నిరసనగా 'డీ లిట్' పట్టాను తిరిగిచ్చేసిన సాహితీవేత్త
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ స్కాలర్ వేముల రోహిత్ (28) ఆత్మహత్యపై ప్రముఖ సాహితీవేత్త వాజ్ పేయి నిరసన వ్యక్తం చేశారు. యూనివర్సిటీలో చోటుచేసుకున్న ఘటనలే రోహిత్ ను ఆత్మహత్యకు ప్రేరేపించాయని పేర్కొన్న ఆయన గతంలో హెచ్ సీయూ ఆయనకు ప్రదానం చేసిన డీలిట్ పట్టాను తిరిగి ఇచ్చేశారు. 'యూనివర్సిటీ నుంచి విద్యార్థులను గెంటేశారు. దీంతో యూనివర్సిటీ బయట విద్యార్థులు టెంటు వేసుకుని ఉంటున్నారు. విద్యార్థులతో యూనివర్సిటీ వ్యవహరించే పద్ధతి ఇదేనా?' అని ఆయన ప్రశ్నించారు. విచారణలో యూనివర్సిటీ తప్పులేదని తేలితే పట్టాను తిరిగి తీసుకునే విషయం ఆలోచిస్తానని ఆయన తెలిపారు. కాగా, కర్నాటకలో రచయిత కల్బుర్గి హత్యకు వ్యతిరేకంగా కేంద్రం ఇచ్చిన కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా ఆయన వెనక్కి ఇచ్చేశారు.