: ధోనీపై అరెస్టు వారెంట్ ఉపసంహరించిన అనంత కోర్టు
భారత వన్డే క్రికెట్ జట్టు కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై జారీ చేసిన అరెస్టు వారెంటును అనంతపురం స్థానిక జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఉపసంహరించుకుంది. అతని తరపున న్యాయవాది అభ్యర్థన మేరకు కోర్టు వారెంట్ ను వెనక్కు తీసుకుంది. తదుపరి విచారణను ఫిబ్రవరి 25కు వాయిదా వేసింది. దాంతో ధోనీకి తాత్కాలిక ఊరట లభించింది. 2013 ఏప్రిల్ లో బిజినెస్ టుడే మ్యాగజైన్ కవర్ పై విష్ణుమూర్తి ఆకారంలో ధోనీ ముఖచిత్రం ప్రచురించారు. అందులో అతను షూస్ కూడా పట్టుకున్నారు. అయితే ఈ ఫోటో హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉందంటూ అప్పట్లో అనంతపురం జిల్లా విశ్వహిందూ పరిషత్ నాయకుడు వై.శ్యాంసుందర్ కోర్టులో కేసు వేశారు. అప్పటినుంచి విచారణ జరుగుతుండగా కోర్టు ఆదేశించినప్పటికీ ధోనీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట ధోనీకి అరెస్టు వారెంట్ జారీ అయింది.