: ఏఎస్సై మోహన్ రెడ్డి ఆస్తి వంద కోట్లా?: ఆశ్చర్యపోయిన జడ్జి
కరీంనగర్ ఏఎస్సై మోహన్ రెడ్డి ఆస్తి వంద కోట్లా? అని హైకోర్టు న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. కరీంనగర్ ప్రధాన పట్టణంలోని కెన్ క్రెస్ట్ స్కూల్స్ అధినేత రామవరం ప్రసాదరావు ఆత్మహత్యతో వెలుగు చూసిన మోహన్ రెడ్డి అక్రమ వసూళ్ల దందా కేసు విచారణ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇళంగో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వడ్డీల పేరుతో అక్రమంగా ఆస్తులను దోచేస్తున్న మోహన్ రెడ్డిపై కేసులు నమోదు చేసిన పోలీసులు, బాధితుల డిమాండ్ తో ఈ కేసును సీఐడీ విభాగానికి బదిలీ చేశారు. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్న సీఐడీ అధికారులు అతనిని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా, అతనికి న్యాయస్థానం జ్యుడీషియల్ రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బెయిల్ పిటిషన్ ను కింది న్యాయస్ధానం రెండు సార్లు కొట్టేయడంతో ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా తన క్లయింట్ విచారణకు సహకరిస్తున్నందున, రిమాండ్ ఖైదీగా సుదీర్ఘకాలంగా జైలులో ఉన్నందున అతనికి బెయిల్ ఇవ్వాలంటూ డిఫెన్స్ లాయర్, జడ్జి ఇళంగోను కోరారు. ఈ సందర్భంగా సీఐడీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామిరెడ్డి తన వాదనలు వినిపిస్తూ, ఏఎస్సైగా పని చేస్తూనే అక్రమ వసూళ్లకు పాల్పడుతూ, సంపాదించిన మొత్తాన్ని వడ్డీ వ్యాపారంలో తిప్పుతూ, అక్రమంగా భారీ మొత్తం వసూలు చేశాడని, అలా పదుల సంఖ్యలో బాధితుల నుంచి ఆస్తులు లాగేసుకున్నాడని, అలా ఆయన సంపాదించిన అక్రమ ఆస్తి మొత్తం వంద కోట్ల రూపాయలకు పైమాటేనని జడ్జికి వివరించారు. కేసు విచారణ కీలక దశలో ఉండగా, అతని పూర్వపు అధికారాలు, స్నేహాలు, పలుకుబడి ఉపయోగించి సాక్షులపై ఒత్తిడి తెచ్చి కేసును తారుమారు చేసే ప్రమాదం ఉందని న్యాయస్థానానికి వివరించారు. దీంతో పీపీ వాదన విన్న జడ్జి, ఏఎస్సై అక్రమ సంపాదన వంద కోట్లా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీంతో అతని అవినీతి హద్దులు దాటి, ప్రాణాలు తీసిందని, తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయన తక్షణం విడుదలకు అనర్హుడు అంటూ బెయిల్ నిరాకరించారు.