: ‘పఠాన్ కోట్’ సూత్రధారి మసూదే!... ముషార్రఫ్ సంచలన ప్రకటన
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు జరిపిన మెరుపు దాడికి సంబంధించి పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు జనరల్ పర్వేజ్ ముషార్రఫ్ మరోమారు సంచలన ప్రకటన చేశారు. పఠాన్ కోట్ దాడి జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ కనుసన్నల్లోనే జరిగిందని ఆయన ప్రకటించారు. దాడి వెనుక పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), పాక్ ఆర్మీ పాత్ర ఉందన్న ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన దాడికి మసూదే స్వయంగా రూపకల్పన చేశాడని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎన్ఎన్-ఐబీఎన్ న్యూస్ చానెల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ముషార్రఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్, పాక్ ల మధ్య సుహృద్భావ వాతావరణానికే పాక్ ఆర్మీ కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ‘‘నన్ను హత్య చేసేందుకు యత్నించిన తర్వాత మసూద్ పాక్ లో ఫ్రీగా తిరగడం లేదు. అయినా పఠాన్ కోట్ దాడికి మాత్రం అతడే రూపకల్పన చేశాడు’’ అని ముషార్రప్ అన్నారు. ఇక పాక్ తో చర్చల కోసం ఆసక్తి కనబరుస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీపైనా ముషార్రఫ్ విమర్శలు గుప్పించారు. పాక్ తో చర్చల కోసం మోదీ మనస్పూర్తిగా యత్నించడం లేదని ఆయన వ్యాఖ్యానించారు.