: దావోస్ బయలుదేరిన చంద్రబాబు... ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళ్లిన ఏకైక సీఎం
స్విట్జర్లాండులోని దావోస్ నగరం పర్యటనకు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న రాత్రే బయలుదేరారు. కీలక శాఖల అధికారులతో కలిసి వెళ్లిన చంద్రబాబు ఈ నెల 23దాకా అక్కడ పర్యటిస్తారు. తన పర్యటనలో భాగంగా వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సు వేదికపై ‘బ్రాండ్ ఏపీ’, ‘సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్’ అంశాలను చంద్రబాబు బృందం ప్రచారం చేయనుంది. చంద్రబాబు పర్యటనకు సంబంధించిన వివరాలను ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ నిన్న మీడియాకు వెల్లడించారు. దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం 46వ సదస్సుకు భారత్ నుంచి హాజరవుతున్న ఏకైన సీఎం చంద్రబాబే. ఫోరం నుంచి ప్రత్యేక ఆహ్వానం అందుకున్న చంద్రబాబు సదస్సులో కీలక ప్రసంగం చేయనున్నారు. ఇక భారత్ నుంచి ఈ సదస్సుకు కేవలం ముగ్గురు ప్రముఖులు మాత్రమే హాజరవుతున్నారు. వీరిలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ రాజన్, చంద్రబాబు ఉన్నారు. దావోస్ పర్యటనలో భాగంగా చంద్రబాబు... నెస్లే, జాన్సన్ కంట్రోల్, ట్రినా సోలార్, సీమెన్స్, మెకిన్సే, లాక్ హీడ్ మార్టిన్- ఎయిర్ బస్, అక్కియోనా ఎనర్జీ, స్పెయిన్, జెట్రో, ఉబెర్, హాన్యా క్యూ సెల్స్, ఫిలిప్స్, అంట్ వెర్ప్ ఫోర్ట్ అథారిటీ, స్విస్ రీ, రోనాల్డ్ బెర్గర్, హ్యూలెట్ పాకార్డ్, ఏసియన్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, మారియట్ ఇంటర్నేషనల్, మెడ్ ట్రానిక్స్, సేల్స్ ఫోర్స్, ఇంటర్ కాంటినెంటల్ హోటల్ తదితర సంస్థలకు చెందిన ప్రతినిధులతో భేటీ కానున్నారు.