: ఫ్రాన్స్ అధ్యక్షుని రాక నేపథ్యంలో 'నిజమైన ప్రమాదం' పొంచివుంది!
వచ్చే వారంలో ఢిల్లీలో జరిగే రిపబ్లిక్ వేడుకలకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలాండే ముఖ్య అతిథిగా రానుండటంతో ఉగ్రవాదుల నుంచి 'నిజమైన ప్రమాదం' పొంచివుందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. జనవరి 26కు ముందే ఏదో ఒక ప్రాంతంలో ఉగ్రదాడి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడి రాక సందర్భంగా దాడులకు ఐఎస్ఐఎస్ వ్యూహాలు పన్నుతున్నట్టు సమాచారం అందిందని నిఘా విభాగం వెల్లడించింది. దీంతో హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ నిర్వహించిన సమావేశంలో గణతంత్ర వేడుకలకు మరింత భద్రత పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. అడుగడుగునా సరిహద్దు భద్రతా దళాన్ని మోహరించాలని ఈ సందర్భంగా రాజ్ నాథ్ ఆదేశించారు. కాగా, ఇండియా నుంచి కొంతమందిని ఉగ్రవాదులుగా మార్చాలన్న ఉద్దేశంతో ఉన్న ఐఎస్ఐఎస్, తను చేసిన ప్రయత్నాల్లో కొంత విజయం సాధించినప్పటికీ, ఉగ్రదాడుల లక్ష్యంగా మాత్రం ఇండియా లేదని ఓ సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు.