: దత్తన్న ఇల్లు ముట్టడి... పోలీసులు, ‘జాగృతి’ కార్యకర్తల తోపులాట, ఉద్రిక్తత


హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇప్పటికే నిన్న వర్సిటీ ప్రాంగణంతో పాటు ఢిల్లీలోని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. తాజాగా నేటి ఉదయం తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఆందోళనలకు శ్రీకారం చుట్టారు. హైదరాబాదులోని రాంనగర్ లో ఉన్న బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఇంటిని వారు ముట్టడించారు. దత్తన్న లేఖ నేపథ్యంలోనే రోహిత్ సహా ఐదుగురు విద్యార్థులు సస్పెన్షన్ కు గురయ్యారన్న వార్తల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీతో పాటు వామపక్షాలు, టీఆర్ఎస్ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టారు. దత్తన్నను తక్షణమే కేంద్ర కేబినెట్ నుంచి బహిష్కరించాలని ఆ పార్టీలు డిమాండ్ చేశాయి. ఇక నేటి ఉదయం జాగృతి కార్యకర్తలు దత్తన్న ఇంటిని ముట్టడించి, రోహత్ ఆత్మహత్యకు దత్తన్న బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దత్తన్న ఇంటిని ముట్టడించిన జాగృతి కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని నిలువరిస్తున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

  • Loading...

More Telugu News