: హైదరాబాదుకు రాహుల్ గాంధీ... హెచ్ సీయూలో విచారణ కమిటీతో భేటీ
హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీలో రీసెర్చి స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఘటన దేశ రాజకీయాలను కుదిపేసేలానే ఉంది. దళిత వర్గానికి చెందిన విద్యార్థులను వర్సిటీలో సాంఘిక బహిష్కరణ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జరిగిన రోహిత్ ఆత్మహత్యతో వర్సిటీతో పాటు నిన్న ఢిల్లీలోనూ ఆందోళనలు ఎగసిపడ్డాయి. బీజేపీ సీనియర్ నేత, కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ లేఖతోనే వర్సిటీ అధికారులు ఐదుగురు విద్యార్థులపై సస్పెన్షన్ విధించారన్న ఆరోపణలు, దత్తన్న రాసిన లేఖ ప్రతి వెలుగుచూసిన నేపథ్యంలో నిన్న ఒక్కసారిగా ఆందోళనలు ఢిల్లీకి తాకాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ వేగంగా స్పందించింది. దత్తన్నను కేంద్ర కేబినెట్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. అంతేకాక కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హైదరాబాదులో పర్యటించాలని నిర్ణయం తీసుకున్నారు. మరికాసేపట్లో ఢిల్లీ నుంచి బయలుదేరే ఆయన నేటి ఉదయం 11 గంటలకు హైదరాబాదు చేరుకుంటారు. శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా ఆయన హెచ్ సీయూకు వెళతారు. రోహిత్ ఆత్మహత్య, తదనంతర పరిణామాలపై సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులతో ఆయన భేటీ కానున్నారు. అంతేకాక వర్సిటీ విద్యార్ధులతోనూ ఆయన సమావేశం కానున్నట్లు సమాచారం.