: సర్కారీ ఉద్యోగాన్ని ఎన్టీఆర్ 11 రోజుల్లో వదిలేశారు!... కారణం చెప్పిన చంద్రబాబు
తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు, తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ వీధుల్లో చాటిచెప్పిన దివంగత నందమూరి తారకరామారావు తొలుత ప్రభుత్వ ఉద్యోగం చేశారు. నటుడిగానే కాక రాజకీయ నేతగా ఆకాశమంత ఎత్తు ఎదిగిన ఎన్టీఆర్, తొలి నాళ్లలో సర్కారీ ఉద్యోగిగానూ పనిచేశారు. అయితే ఇటు ఉద్యోగంలో చేరారో, లేదో... అటు ఆ పోస్టుకు రాజీనామా చేసేశారట. ఈ మాట చెబుతోంది ఎవరో కాదు... స్వయానా ఆయన అల్లుడు, ఆయన స్థాపించిన పార్టీకి ఆయన తర్వాత నేతృత్వం వహిస్తున్న నారా చంద్రబాబునాయుడు. నిన్న ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని విజయవాడలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు ఆ మహనీయుడి జ్ఞాపకాలను మననం చేసుకున్నారు. తొలినాళ్లలో సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం సాధించిన ఎన్టీఆర్ సదరు పోస్టులో చేరిపోయారట. అయితే అక్కడి అవినీతి వాతావరణంలో ఇమడలేక ఎన్టీఆర్ కేవంల 11 రోజులకే తన ఉద్యోగానికి రాజీనామా చేశారని చంద్రబాబు పేర్కొన్నారు.