: నాపై ఆరోపణలు సబబు కాదు: సెంట్రల్ వర్శిటీ వీసీ అప్పారావు
పీహెచ్డీ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యతో సెంట్రల్ యూనివర్శిటీ రణరంగంగా మారింది. అంతేకాదు, రాజకీయ రంగు కూడా పులుముకుంది. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, సెంట్రల్ యూనివర్శిటీ అధికారులే కారణమని విద్యార్థులు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వర్శిటీ వీసి అప్పారావుని వెంటనే అరెస్టు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో తనపై ఆరోపణలు చేయడం సబబు కాదని అప్పారావు అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘రోహిత్ మృతికి నేనే కారణమని విద్యార్థులు అనుకోవడం చాలా దురదృష్టకరం. ఏదైనా అవకాశముంటే విద్యార్థులకు నేను సహాయపడాలనే చూశాను. వాళ్లకు ఇబ్బంది కలిగేలా నేనెప్పుడూ ప్రవర్తించలేదు. రోహిత్ కు గతంలో ఇచ్చిన పనిష్మెంట్ ను తగ్గించామని అనుకుంటున్నాను. ఏమైనా, ఈ విధంగా జరగడం దురదృష్టకరం. నేను చాలా ఫీలవుతున్నాను. సస్పెన్షన్ పీరియడ్ లో రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం నాకు చాలా బాధ కల్గిస్తోంది’ అన్నారు. తాము దీక్షా శిబిరంలో ఉన్న సమయంలో వారిని పట్టించుకోలేదని, వారి సమస్యలను, బాధలను చెప్పుకునే అవకాశం వీసీ కల్పించలేదని విద్యార్థులు అంటున్నారన్న ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ.. స్టూడెంట్స్ వెల్ఫేర్ డీన్ తో ఈ విషయమై తాను నిత్యం మాట్లాడేవాడినని, ప్రతిదీ వీసీనే చెయ్యాలన్నా, మాట్లాడాలన్న కుదరదని.. అది టీమ్ వర్క్ ద్వారా సాధ్యమని, ఆ విధంగానే ముందుకెళ్లానని అప్పారావు అన్నారు. రోహిత్ ను ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చిందనే విషయమై ఆయన మాట్లాడుతూ, ఇది తాను తీసుకున్న నిర్ణయం కాదని, తాను రాకముందు ప్రాటోరియల్ బోర్డు తీసుకున్న నిర్ణయమని అన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమని, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని అప్పారావు చెప్పారు.