: అజిత్ చండీలాపై జీవితకాల నిషేధం
రాజస్థాన్ రాయల్స్ ను ఒక్క కుదుపు కుదిపేసిన స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో నిందితుడు అజిత్ చండీలాపై జీవిత కాలం నిషేధం వేటు పడింది. బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ నేతృత్వంలోని క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. చండీలాతో పాటు ముంబైకి చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ హికిన్ షాపై కూడా ఐదేళ్లపాటు నిషేధం విధిస్తున్నట్టు బీసీసీఐ తెలిపింది. తాజా నిర్ణయంతో వీరిద్దరూ క్రికెట్ కు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లోను పాలుపంచుకునే వీలుండదని బీసీసీఐ స్పష్టం చేసింది. కాగా, 2013లో కలకలం రేపిన స్పాట్ ఫిక్సింగ్ వివాదంలో శ్రీశాంత్, అంకిత్ చవాన్ తో అజిత్ చండీలా కూడా అరెస్టైన సంగతి తెలిసిందే. అప్పట్లో శ్రీశాంత్, అంకిత్ చవాన్ పై జీవితకాల నిషేధం విధించిన బీసీసీఐ నేడు అజిత్ చండీలాపై విధించింది.