: వికెట్లు పడతున్నా లక్ష్యం చేరాలని నిర్ణయించుకున్నా: మ్యాక్స్ వెల్
టీమిండియా బౌలర్లు అద్భుతమైన బంతులు వేశారని మూడో వన్డే లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన గ్లెన్ మ్యాక్స్ వెల్ తెలిపాడు. మెల్ బోర్న్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మ్యాక్స్ వెల్ మాట్లాడుతూ, తన ముందు వికెట్లు వడివడిగా పడిపోవడంతో ఒత్తిడి పెరిగిందని చెప్పాడు. అయితే టాప్ ఆర్డర్ అవుటవుతున్నప్పుడు లక్ష్యాన్ని ఎలాగైనా పూర్తి చేయాలని భావించానని అన్నాడు. చివర్లో అవుట్ కావడం కాస్త ఇబ్బంది పెట్టిందని, మిగిలిన పనిని సహచరులు పూర్తి చేశారని చెప్పాడు. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్ మాట్లాడుతూ, ఈ పిచ్ పై గెలవడం కాస్త కష్టమేనని పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్లు అద్భుతమైన బంతులేశారని చెప్పాడు. అయితే తమ జట్టు సమష్టిగా రాణించడంతో విజయం సాధ్యమైందని స్టీవ్ స్మిత్ వెల్లడించాడు.