: చంద్రబాబు పతనానికి ఇదే నాంది: వైకాపా
తమ పార్టీ నేత మిధున్ రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. గత రాత్రి ఆయన్ను చెన్నై ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకుని ఈ ఉదయం న్యాయమూర్తి ముందు హాజరు పరిచి రిమాండ్ చేయడంపై వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విరుచుకుపడ్డారు. కొద్దిసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ, ఓ ప్రజా ప్రతినిధిని ఇలా అరెస్ట్ చేయడంతో చంద్రబాబు పతనానికి నాంది పడిందని ఆయన నిప్పులు చెరిగారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఆనవాళ్లు కనిపించడం లేదని, ఇంత దుర్మార్గంగా ఓ ఎంపీని అరెస్ట్ చేయడం ఎక్కడా చూళ్లేదని అన్నారు. మిధున్ రెడ్డిని పిలిస్తే, నేరుగా వచ్చి విచారణకు హాజరయ్యేవారని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే చింతమనేనిని రక్షించిన చంద్రబాబు, విపక్ష నేతలపై రాక్షసంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాజీ అయిన కేసులో అరెస్టులు అన్యాయమని, చిత్తూరు జిల్లాలో 250 చెక్ పోస్టులు పెట్టి కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ, వైకాపా ఎమ్మెల్యేలను ఇంటి నుంచి బయటకు రానివ్వడం లేదని విమర్శించారు. ప్రభుత్వం చర్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారని తెలిపారు.