: ఇండియాలోని ఏ ప్రాంతంపైనైనా అణు బాంబేయగలం: ఉగ్రవాది హఫీజ్ సయీద్
26/11 దాడులకు మాస్టర్ మైండ్ గా భావిస్తున్న జమాత్ - ఉద్ - దవా చీఫ్ హపీజ్ సయీద్ మరోసారి విషం కక్కాడు. పాక్ లో ఉన్న అణు ఆయుధాలతో ఇండియాలోని ఏ ప్రాంతాన్నైనా తాము ధ్వంసం చేయగలమని అన్నాడు. జమాత్ - ఉద్ - దవా మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, భారత్ తో పాటు ఇజ్రాయిల్ కూడా పాక్ దేశపు అణ్వాయుధాల పరిధిలో ఉందని తెలిపాడు. కాశ్మీర్ తదితర అంశాలపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ముందు పాక్ వైఖరిని గట్టిగా వినిపించడంలో ప్రధాని నవాజ్ షరీఫ్ విఫలమయ్యాడని విమర్శించాడు. పాక్ లో భారత 'రా' జరుపుతున్న ఉగ్ర చర్యలపై సాక్ష్యాలను వెంటతీసుకుని అమెరికా వెళ్లిన నవాజ్, ఏ మాత్రం ప్రయోజనాన్ని సాధించుకు రాలేకపోయాడని నిప్పులు చెరిగాడు. భారత్ కు వ్యతిరేకంగా సాక్ష్యాలను జాన్ కెర్రీకి అందించిన షరీఫ్, ఒబామా వద్ద విఫలమయ్యాడని ఆరోపించాడు. దేశ భక్తి సంస్థలైన జేయూడీ, హక్కానీ నెట్ వర్క్, లష్కరే తోయిబా సంస్థలపై చర్యలు తీసుకుంటే పరిస్థితి తీవ్రంగా మారుతుందని హెచ్చరించాడు.