: బల్దియా చిత్రం... బరిలో తండ్రీ కొడుకులు!
గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలకు నామినేషన్లు జోరుగా సాగుతున్న వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. జూబ్లీహిల్స్ పరిధిలోని వెంగళ్ రావు నగర్ డివిజన్ లో తండ్రీ కోడుకులు పోటీకి దిగారు. డివిజన్ లో బీజేపీ టికెట్ ను ఆశించి భంగపడ్డ కాలేరు రవీందర్ ఖైరతాబాద్ లోని బల్దియా సెంట్రల్ జోన్ కార్యాలయంలో రెబల్ అభ్యర్థిగా తన నామినేషన్ దాఖలు చేయగా, ఆపై కొద్ది సేపటికే ఆయన కుమారుడు కాలేరు నవీన్ కుమార్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎవరు గెలిచినా డివిజన్ తమ చేతుల్లోనే ఉంటుందన్న ధీమాను వారు వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు అనంతరం బయట కలుసుకున్న తండ్రీ కొడుకులు ఒకే వాహనంలో ఇంటికి వెళ్లిపోవడం కొనమెరుపు.