: స్టార్టప్, అసహనం కలిసి సాగలేవు... బీజేపీ వైఖరిపై నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. స్టార్టప్ ల మంత్రాన్ని బీజేపీ సర్కారు పఠిస్తుంటే, ఆ పార్టీ సైద్ధాంతిక గురువు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కఠిన వైఖరితో సాగుతోందని ఆయన ఆరోపించారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ నేటి ఉదయం నగరంలోని జుహూ-విలేపార్లే పరిధిలోని ‘నర్సీ మాంజీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్’ విద్యార్థులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ బీజేపీ ద్వంద్వ వైఖరితో పాలన సాగిస్తోందని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. స్టార్టప్, అసహనం... రెండూ చేతులు కలిపి ముందుకు పయనించలేవని ఆయన తేల్చిచెప్పారు. స్వేచ్ఛ ఉన్నప్పుడే స్టార్టప్ లు వృద్ధి చెందుతాయని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాక బీజేపీ సర్కారు దేశ ప్రజలను వర్గాలుగా చీలుస్తోందని విమర్శించారు. దేశ ప్రజలను బీజేపీ సర్కారు హిందువులు, ముస్లింలు అంటూ విభజిస్తోందని దుయ్యబట్టారు. అయితే తాము మాత్రం దేశ ప్రజల మధ్య విభజన రేఖలను గీయడం లేదన్నారు. ఇదే తమకూ, బీజేపీకి ఉన్న తేడా అని ఆయన వ్యాఖ్యానించారు.