: ‘పీకే’ ప్రమోషన్ కోసం...ఆమిర్ ఐఎస్ఐ సహకారం తీసుకున్నాడు: సుబ్రహ్మణ్య స్వామి ఆరోపణ
బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పై ఇటీవల బీజేపీ నేతలు వరుసగా విరుచుకుపడుతున్నారు. దేశంలో ‘అసహనం’పై పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో ‘‘దేశం వదిలి వెళదామంటూ నా భార్య చెప్పింది’’ అంటూ ఆమిర్ చేసిన వ్యాఖ్యలు పెను కలకలాన్నే రేపాయి. ఫలితంగా అప్పటిదాకా ‘ఇన్ క్రెడిబుల్ ఇండియా’కు బ్రాండ్ అంబాసిడర్ గా కొనసాగుతున్న ఆమిర్ ఆ తర్వాత ఆ హోదాను కోల్పోయాడు. నిన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ అతడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ముందుగా నీ భార్యకు చెప్పుకో’ అంటూ ఆమిర్ పై రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్నే రేపాయి. తాజాగా సుబ్రహ్మణ్యస్వామి రంగంలోకి దిగారు. కొద్దిసేపటి క్రితం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఆమిర్ పై విరుచుకుపడ్డారు. కలకలం రేపే వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను నటించిన బాలీవుడ్ భారీ బడ్జెట్ చిత్రం ‘పీకే’ ప్రమోషన్ కోసం ఆమిర్, పాక్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) సహకారం తీసుకున్నాడని సుబ్రహ్మణ్యస్వామి ఆరోపించారు. దీనిపై ఆమిర్ ఎలా స్పందిస్తాడో చూడాలి!