: సునంద పుష్కర్ మరణం సహజం కాదు!: తేల్చిచెప్పిన ఢిల్లీ పోలీస్ కమిషనర్


కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ భార్య సునంద పుష్కర్ మరణం సహజం కాదని ఢిల్లీ పోలీస్ కమిషనర్ బీఎస్ బస్సీ తేల్చి చెప్పేశారు. ప్రమాదకరమైన రసాయన పదార్థం కారణంగానే ఆమె చనిపోయిందని ఆయన నిన్న ప్రకటించారు. సునంద పుష్కర్ శరీర భాగాలకు సంబంధించి అమెరికా దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్ బీఐ) అందించిన రిపోర్ట్ ను అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యులు క్షుణ్ణంగా విశ్లేషించి అందజేసిన తుది నివేదిక తర్వాత బస్సీ ఈ మేరకు ప్రకటించారు. అయితే సదరు ప్రమాదకర రసాయన పదార్థం ఏమిటన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. ‘‘ఎయిమ్స్ వైద్యులు అందించిన నివేదిక చాలా సుదీర్ఘంగా ఉంది. మొత్తం 11 పేజీల నివేదికను సమగ్రంగా పరిశీలించిన తర్వాత కాని దీనిపై మరిన్ని వివరాలు వెల్లడించలేం. మొత్తం నివేదికను చదివిన తర్వాత తదుపరి దర్యాప్తు చేపడతాం’’ అని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సునంద శరీరంపై దాదాపు 12 గాయాల గుర్తులను కూడా నివేదిక గుర్తించినట్లు సమాచారం. ఈ గుర్తుల్లో ఓ సిరంజి మార్కు కూడా ఉందని సదరు నివేదిక వెల్లడించిందట. ఈ నేపథ్యంలో తదుపరి దర్యాప్తులో భాగంగా శశి ధరూర్ మరోమారు పోలీసుల విచారణను ఎదుర్కోక తప్పేలా లేదు. శశి థరూర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని ఓ లగ్జరీ హోటల్ లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ కు చెందిన ఓ మహిళా జర్నలిస్టుతో థరూర్ సంబంధం నెరపుతున్నాడన్న కారణంగా సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని నాడు ఆరోపణలు వినిపించాయి.

  • Loading...

More Telugu News