: ఢిల్లీ ప్రజలకు ధన్యవాదాలు...మళ్లీ సహకరించండి: కేజ్రీవాల్
ఢిల్లీ ప్రజలకు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రవేశపెట్టిన సరి-బేసి విధానం విజయవంతమైందని అన్నారు. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలని ఆయన చెప్పారు. ఈ విధానానికి ఢిల్లీ హైకోర్టు మద్దతు తెలిపిందని ఆయన గుర్తుచేశారు. ఈ విధానం ప్రవేశపెట్టి 15 రోజులు పూర్తి కావస్తున్న సందర్భంగా మరోసారి ఈ విధానం కొనసాగించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. అయితే ఈ సారి జరిమానా అనేది ఉండదని, ప్రజలే స్వచ్ఛందంగా ఇందులో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. తాము ప్రవేశపెట్టిన సరి, బేసి విధానం వల్ల ఎప్పుడూ కార్లలో ప్రవేశించే వారు తొలిసారి మెట్రోరైల్ ఎక్కారని, మెట్రో ప్రయాణం ఎంతో బాగుందని అన్నారని, అలాగే కార్ పూలింగ్ విధానం కూడా బాగుందని, వినియోగారుడికి, ఉత్పత్తిదారుడికి కూడా ఉపయోగకరంగా ఉందని తనతో చాలామంది చెప్పారని కేజ్రీవాల్ వెల్లడించారు. తాము చేపట్టిన ఈ విధానం వల్ల 30 శాతం కాలుష్యం తగ్గిందని చెప్పిన ఆయన, ట్రాఫిక్ ఇబ్బందులన్నీ తీరిపోయాయని స్పష్టం చేశారు.