: రోహిత్ శర్మ సెంచరీ... భారత్ డబుల్ సెంచరీ!


టీమిండియా స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ వీర విహారం చేస్తున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత తొలి సిరీస్ ఆడుతున్న అతడు పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టుపై తొలి వన్డేలోనే 171 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి వన్డేలో జట్టు భారీ స్కోరుకు పునాది వేశాడు. ఆది నుంచి అంతం దాకా క్రీజులోనే పాతుకుపోయాడు. అతడిని పెవిలియన్ చేర్చడం ఆసీస్ బౌలర్లకు సాధ్యం కాలేదు. ఆ మ్యాచ్ లో టీమిండియా పరాజయం కావడంతో రోహిత్ రికార్డ్ హిట్టింగ్ మరుగున పడిపోయింది. అయినా అతడేమీ నిరాశ చెందలేదు. అందుకు నిదర్శనంగా అతడు రెండో వన్డేలోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. నేటి ఉదయం బ్రిస్బేన్ లో ప్రారంభమైన రెండో వన్డేలో రోహిత్ శర్మ వరుసగా రెండో సెంచరీ చేశాడు. అంతేకాక భారత జట్టు స్కోరును అతడు డబుల్ సెంచరీ దాటించేశాడు. తనతో కలిసి క్రీజులో అడుగుపెట్టిన శిఖర్ ధావన్ (6) స్వల్ప స్కోరుకే వెనుదిరిగినా, అతడేమీ భయడపలేదు. శిఖర్ స్థానంలో తనతో జతకలిసిన స్టార్ బ్యాట్స్ మన్ విరాట్ కోహ్లీ (59)తో కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కొద్దిసేపటికే కోహ్లీ అవుటైనా రోహిత్ మాత్రం అలసిపోలేదు. అజింక్యా రెహానే (49) తో కలిసి ఆసీస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. రోహిత్ జోరుతో రెహానే కూడా సునాయసంగానే హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. రెండో వన్డేలోనూ వరుసగా రెండో సెంచరీ పూర్తి చేసిన రోహిత్, తన కెరీర్ లో పదో సెంచరీని నమోదు చేశాడు. 40 ఓవర్లు ముగిసేసరికి భారత జట్టు స్కోరు రెండు వికెట్ల నష్టానికి 233 పరుగులకు చేరుకుంది. ఇన్నింగ్స్ లో ఇప్పటిదాకా 119 బంతులను ఎదుర్కొన్న రోహిత్ 95.79 సగటుతో 115 పరుగులు చేశాడు.

  • Loading...

More Telugu News