: పందెం కోడి మెనూలో మటన్ కీమా... డ్రై ఫ్రూట్స్, పచ్చి గుడ్డు కూడానట!
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కోడి పందాల జోరు కొనసాగుతోంది. మొన్న సాయంత్రం నుంచే మొదలైన కోడి పందాల జోరు గంట గంటకూ పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆ నాలుగు జిల్లాలకు చేరుకున్నారు. ప్రత్యేకంగా టెంట్లు వేసి మరీ నిర్వాహకులు పోటీలు నిర్వహిస్తున్నారు. కోట్లాది రూపాయల బెట్టింగ్ జరుగుతున్న ఈ పోటీల్లో పందెం కోళ్లే ప్రధానం. మరి ఈ కోళ్లను పోటీలకు సిద్ధం చేస్తున్న తీరు మరింత ఆసక్తికరమే. మేలు జాతికి చెందిన కోడి పుంజులను ఆరు నెలల పాటు పోషిస్తున్న నిర్వాహకులు అందుకోసం లక్షలాది రూపాయలను ఖర్చు పెడుతున్నారు. అయినా కోడి దాణా కోసం లక్షలెందుకు ఖర్చవుతాయనేగా... మీ డౌటు? బాదాం పలుకులు, ఎండు ద్రాక్షలతో పాటు ఖరీదైన డ్రై ఫ్రూట్స్, మటన్ కీమా, పచ్చి గుడ్లతో ఆరు నెలల పాటు సదరు కోళ్లను మేపితే.. లక్షలు ఖర్చవుతాయిగా. ఇక పోటీల్లో ప్రత్యర్థి కోడిపై దాడి చేసేందుకు ఆ కోళ్లకు ఎక్సర్ సైజులు కూడా చేయిస్తారట.