: బ్యాగ్ లో బీఫ్ ఉందంటూ ముస్లిం జంటను చావబాదారు
దేశంలో బీఫ్ వివాదాలు ఇప్పట్లో చల్లారేలా లేవు. తాజాగా మధ్యప్రదేశ్ భోపాల్ లోని హర్డా జిల్లాలో ఖిర్కియా రైల్వే స్టేషన్ లో ఒక ముస్లిం జంట నుండి కొంతమంది వారి బ్యాగ్ లాక్కునే ప్రయత్నం చేశారు. అయితే దంపతులు వారిని అడ్డుకున్నారు. దీంతో మరింత రెచ్చిపోయిన అల్లరిమూక వారి బ్యాగ్ లో బీఫ్ ఉందని ఆరోపిస్తూ ఆ జంటను చావబాదారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమకు గోరక్షణ సమితి సభ్యుల నుండి కుషీనగర్ ఎక్స్ ప్రెస్ లో ఒక ముస్లిం జంట దగ్గర బీఫ్ ఉందని సమాచారం అందిందన్నారు. అయితే తాము ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లి బ్యాగును పరిశీలించగా అటువంటిదేమీ లేదని తేలిందన్నారు. కాగా నిందితుల్లో ఇద్దరిని ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారికోసం గాలిస్తున్నామని చెప్పారు.