: వంద సీట్లు గెలవకపోతే రాజీనామా చేస్తానని నేను ఎక్కడా అనలేదు: కేటీఆర్
గ్రేటర్ హైదరాబాదు ఎన్నికల్లో వంద సీట్లు గెలుచుకోని పక్షంలో మంత్రి పదవికి రాజీనామా చేస్తానని తాను అనలేదని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాదులో ఓ టీవీ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రేటర్ హైదరాబాదు నగరపాలక సంస్థ మేయర్ పీఠంపై టీఆర్ఎస్ అభ్యర్థి కూర్చోని పక్షంలో మాత్రమే తన పదవికి రాజీనామా చేస్తానని చెప్పానని తెలిపారు. మొత్తం 150 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుందని, అందులో 100 సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తెలిపానని ఆయన స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు తలాతోకలేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాయి తప్ప, తన సవాలును స్వీకరించలేదని ఆయన చెప్పారు. వంద సీట్లు తమకు వచ్చేస్తాయని చెబుతున్న నేతలు తన సవాలును ఎందుకు స్వీకరించడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ క్షణం ఎన్నికలు జరిగితే 80 సీట్లను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, ఎన్నికల షెడ్యూల్ దగ్గరపడే కొద్దీ ఈ సంఖ్య పెరుగుతుందని ఆయన చెప్పారు.