: రూ. 837కు విమానం టికెట్లు ప్రకటించిన ఇండిగో
హైదరాబాద్ నుంచి విజయవాడకు బస్సులో వెళ్లేందుకే రూ. 1000కి పైగా చెల్లించాల్సి వస్తున్న వేళ, ఇండియాలో అతిపెద్ద విమానయాన సంస్థగా ఉన్న ఇండిగో ప్రత్యేక ప్రమోషనల్ ఆఫర్ కింద కనీస చార్జీ రూ. 837 (అన్ని పన్నులు కలుపుకుని)కే విమాన ప్రయాణాన్ని దగ్గర చేసింది. రేపటిలోగా టికెట్లు బుక్ చేసుకుని ఫిబ్రవరి 3 నుంచి ఏప్రిల్ 12 మధ్య ప్రయాణం పెట్టుకునే వారికి ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది. అగర్తలా - గౌహతి మధ్య ప్రయాణానికి ఈ ధర వర్తిస్తుంది. ఆపై అగర్తలా - కోల్ కతా మధ్య రూ. 1,237 నుంచి, అహ్మదాబాద్ - ముంబై మధ్య రూ. 1,263 నుంచి, బెంగళూరు - చెన్నై మధ్య రూ. 974 నుంచి, హైదరాబాద్ - చెన్నై మధ్య, హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య రూ. 1,832 నుంచి, హైదరాబాద్ - ముంబై మధ్య రూ. 1,937 టికెట్ ధరలు ప్రారంభం అవుతాయని సంస్థ వెల్లడించింది. కాగా, ఇటీవల చౌక ధరలకు ప్రయాణ సేవలందిస్తున్న గో ఎయిర్ రూ. 601 (బేస్ ఫేర్, ఫ్యూయల్ సర్ చార్జ్)కి, స్పైస్ జెట్ రూ. 716 (పన్నులు మినహా), ఎయిర్ ఆసియా రూ. 899 (అన్ని పన్నులు కలుపుకుని)లకు ప్రమోషనల్ స్కీములు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇండియాలో దేశవాళీ విమాన ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఈ తరహా స్కీములే కారణమని నిపుణులు వ్యాఖ్యానించారు. గత సంవత్సరం జనవరి నుంచి నవంబర్ వరకూ 61 కోట్ల మంది విమానాల్లో ప్రయాణించారు. 2014తో పోలిస్తే ఇది 20 శాతం అధికం.