: సుప్రీం ఆదేశాలు బేఖాతరు... గోదావరి జిల్లాల్లో ఎక్కడ చూసినా 'కొక్కొరొక్కో'!
కోడి పందాలు కూడదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చినా, వాటిని బేఖాతరు చేసిన రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, స్థానిక పెద్దలు భోగి నాడు పొద్దున్నే కోడి పందేల బరుల వద్ద చేరిపోయారు. ముఖ్యంగా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో దాదాపు ప్రతి ఊరిలో పందెపు బరులు సిద్ధమయ్యాయి. గుండాట, మూడు ముక్కలాట కూడా జోరుగా జరుగుతోంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాలతో పాటు భీమవరం, ఉండి, పాలకొల్లు, నరసాపురం, ఏలూరు, ఆకివీడు, కైకలూరు తదితర ప్రాంతాల్లో స్వయంగా తెలుగుదేశం నాయకులు దగ్గరుండి మరీ పందాలు కాయిస్తున్నారు. పోలీసులు మాత్రం కోడి పందాలను జరగనీయడం లేదని, ఇప్పటికే 1000 మందిపై బైండోవర్ కేసులు పెట్టామని, కోడి పందాలాడితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాగా, నిన్న ఏలూరు ఎంపీ మాగంటి బాబు స్వయంగా కోళ్లను ఎగరేసి పందాలు మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. కోడి పందాలు మూడు రోజుల పాటు జరగనుండగా, వందల కోట్ల రూపాయలు చేతలు మారుతాయని అంచనా.