: మంత్రి బొజ్జలకు బుల్లెట్ ప్రూఫ్ కారు... ‘ఎర్ర’ దొంగల నుంచి ముప్పే కారణమట
శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం చెట్లు నానాటికీ తగ్గిపోతున్నాయి. విలువైన గంధపు మొక్కలపై కన్నేసిన స్మగ్లర్లు ఇష్టారాజ్యంగా చెట్లను నరికేస్తూ వాటిని దుంగలుగా మార్చి దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. మొన్నటిదాకా యథేచ్ఛగా జరిగిన ఎర్రచందనం అక్రమ రవాణాకు టీడీపీ అధికారంలోకి రాగానే దాదాపుగా అడ్డుకట్ట పడింది. పోలీసులు, అటవీ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం రెడ్ శాండల్ స్మగ్లింగ్ కు చెక్ పెట్టింది. ఇదంతా టీడీపీ సీనియర్ నేత, ఏపీ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి చొరవతోనే సాధ్యమైంది. అయినా కోట్లాది రూపాయల రాబడిని రుచిమరిగిన ఎర్రచందనం స్మగ్లర్లు సరికొత్త మార్గాల్లో దుంగలను తరలించేస్తున్నారు. ఈ క్రమంలో తమకు అడ్డువచ్చిన టాస్క్ ఫోర్స్ పోలీసులను హతమార్చేందుకు కూడా వెనుకాడటం లేదు. ఈ నేపథ్యంలో బొజ్జలను కూడా ఎర్రచందనం దొంగలు టార్గెట్ చేశారట. ఈ మేరకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందుకున్న ఏపీ ప్రభుత్వం బొజ్జలకు భద్రతను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఆయనకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కేటాయించింది. వ్యక్తిగత భద్రతా సిబ్బంది సంఖ్యను మరింత పెంచింది. ముందస్తు సమాచారం లేకుండా ఎక్కడికీ వెళ్లరాదంటూ బొజ్జలకు విజ్ఞప్తి చేసింది.