: ప్రియుడి మృతదేహాన్ని వివాహమాడిన ప్రియురాలు!
ప్రేమించుకున్నారు...మూడుముళ్లతో ఒక్కటవుదామని భావించారు. ఇంతలోనే విధి వక్రీకరించింది. ప్రియుడు గుండెపోటుతో మృతి చెందడంతో అతని మృతదేహాన్ని ప్రియురాలు వివాహం చేసుకున్న ఘటన థాయ్ లాండ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...చచోయాంగ్ సావో ప్రావిన్స్ కు చెందిన నాన్ తిఫారత్ కు ఫియత్ అనే వ్యక్తితో వివాహం నిశ్చయమైంది. వివాహానికి ఇంకా సమయం ఉండడంతో కాబోయే భర్తతో ఆమె ప్రేమలో పడింది. ఇంతలో వివాహముహూర్తం దగ్గర పడింది. పెళ్లికి సిద్ధమవుతున్న ఫియత్ కు హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. దీంతో తన వివాహ జీవితంపై ఎన్నో కలలు కన్న తిఫారత్ కుప్పకూలింది. ఫియత్ అంత్యక్రియల రోజున, అతని మృతదేహంతో వివాహతంతు పూర్తి చేసి నూతన వధువుగా భర్తకు అంతిమ వీడ్కోలు పలికింది. తరువాత ఆ ఫోటోలను ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ... 'నువ్వే నా జీవితం, వివాహ బంధంతో ఒకటవుదామనుకున్న మన కల నెరవేరింది. నీ ఆత్మకు శాంతి కలగాలి' అంటూ పేర్కొంది. ఆమె ఫేస్ బుక్ లో ఈ ఫోటోలు పోస్టు చేసిన కొద్ది సేపటికే ఇవి వైరల్ అయ్యాయి. నెటిజన్లు ఆమెను సానుభూతిలో ముంచెత్తారు. కాగా, ఆమె వివాహం చట్టబద్ధమైనది కాదని ధాయ్ లాండ్ ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.