: ఎన్టీఆర్ పేరు చెప్పుకుని వసూలు చేస్తున్న మొత్తాన్ని ఏం చేస్తున్నారు?: లక్ష్మీ పార్వతి
మహానటుడు నందమూరి తారకరామారావు పేరు చెప్పుకుని ఎంతో మంది బతుకుతున్నారని ఆయన భార్య లక్ష్మీపార్వతి వ్యాఖ్యానించారు. హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, నందమూరి తారకరామారావు ట్రస్ట్ పేరుతో విదేశాలకు వెళ్లి విరాళాలు వసూలు చేస్తున్నారని అన్నారు. ఈ తంతు ఎన్నో సంవత్సరాలుగా జరుగుతోందని, అలా సేకరించిన మొత్తాన్ని ఏం చేశారో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆమె డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ అవార్డు పేరిట ఓ మెమెంటో, శాలువా ఇస్తున్నారని, నగదు పురస్కారం ఇవ్వడం లేదని ఆమె మండిపడ్డారు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపు అంటున్నారని, అలా సేకరించిన రక్తాన్ని ఏం చేస్తారని ఆమె అడిగారు. బతుకుదెరువు కోసం ఆయన పేరు అందరికీ కావాలని, ఆయన పేరు మీద ఏదైనా చేయాలంటే ప్రజలు సహకరించాలని కోరుతున్నారని, సొంతంగా చేయాలని ఎందుకు ఆలోచించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ పేరిట ఏం చేస్తున్నారో ప్రజలకు వివరించాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు.