: ఒకే రోజులో సామాన్యుడి నుంచి ముఖ్యఅతిథిని అయ్యాను: అమితాబ్ బచ్చన్
ఒకే రోజులో సామాన్యుడి నుంచి ముఖ్యఅతిథిగా మారానని ప్రముఖ బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ తన ఫేస్ బుక్ ఖాతా లో పేర్కొన్నారు. సామాన్యుడి నుంచి ముఖ్యఅతిథిగా ఆయన ఎలా మారారంటే... అమితాబ్ తాజా చిత్రం ‘తీన్’ షూటింగ్ ప్రస్తుతం కోల్ కతాలో జరుగుతోంది. ఈ చిత్రంలో ఆయన సామాన్యుడి పాత్రలో నటిస్తున్నారు. ఇక ముఖ్యఅతిథిగా ఎలా అంటే.. మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలి భార్య డోనా గంగూలి ఆధ్వర్యంలో కోల్ కతాలోని విక్టోరియా మెమోరియల్ లో ఒక సాంస్కృతిక కార్యక్రమం నిన్న రాత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బిగ్ బీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ రెండింటికి లింక్ పెట్టి ‘ఒకే రోజులో సామాన్యుడు నుంచి ముఖ్యఅతిథిగా’ అంటూ అమితాబ్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. దీంతో పాటు తీన్ చిత్రం లో ఒక సన్నివేశంతో పాటు డోనా గంగూలి కార్యక్రమానికి హాజరైన ఫొటోను కూడా అమితాబ్ పోస్ట్ చేశారు.