: విమానంలో టికెట్ లేకుండా ప్రయాణిద్దామనుకుని విగతజీవిగా మారాడు...!
బస్సులు, రైళ్లలో టికెట్ లేకుండా ప్రయాణించడం అప్పుడప్పుడు చూస్తుంటాం. అలాంటిది ఓ వ్యక్తి ఏకంగా విమానంలో టికెట్ లేకుండా ప్రయాణిద్దామని భావించి విగతజీవిగా మారిన ఘటన పారిస్ లోని ఓర్లీ ఎయిర్ పోర్ట్ లో చోటుచేసుకుంది. బ్రెజిల్ నుంచి పారిస్ చేరుకున్న బోయింగ్ 777 విమానం ల్యాండ్ అవుతూ, విమానం టైర్లు తెరుచుకుంటుండగా ఓ వ్యక్తి మృతదేహం రన్ వే పై పడింది. తక్షణం స్పందించిన విమానయాన అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో టైర్ లో దాక్కుని, ప్రయాణించి ప్రాణాలు కోల్పోయాడని వారు తేల్చారు. దీనిపై కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. ఈ సందర్భంగా విమానయాన అధికారులు మాట్లాడుతూ, చాలా మంది వీల్ లో దాక్కుని ప్రయాణించాలని చూస్తారని, అలాంటి వారిలో ఎక్కువ మంది విమానం బాగా ఎత్తులో ఎగరడం వల్ల ఆక్షిజన్ అందక మరణిస్తారని, మరికొందరు ఎలాగోలా బతికిబట్టకట్టినా వీల్ తెరుచుకునే సమయంలో విమానాశ్రయం సమీపంలోని భవనాలపై పడి మరణిస్తారని అధికారులు వెల్లడించారు.