: 'నో సెల్ఫీ జోన్లు' వచ్చేస్తున్నాయ్!
తాత్కాలికమైన 'లైక్'లు, 'షేర్'ల ఆనందం కోసం సెల్ఫీల మోజులో పడిన యువతకు అడ్డుకట్ట పడనుంది. పర్వతాల శిఖరాలపై సెల్ఫీలు దిగుతూ ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు పెరుగుతున్న వేళ, 'నో సెల్ఫీ జోన్'లను గుర్తించాలని మహారాష్ట్ర పోలీసులు నిర్ణయించారు. ఇటీవల బాంద్రా వద్ద సెల్ఫీ దిగుతూ ముగ్గురు అమ్మాయిలు సముద్రంలో పడిన ఘటనను సీరియస్ గా తీసుకున్న మహారాష్ట్ర ప్రభుత్వం యువతకు సెల్ఫీలు దిగేందుకు అనుమతించని ప్రాంతాలను గుర్తించాలని ఆదేశించింది. శనివారం నాడు తరన్నుమ్ అన్సారీ (15), అంజుమ్ (19), మస్తూరీ (19)లు అరేబియా సముద్రం సమీపంలో సెల్ఫీ దిగుతూ పడిపోగా, స్థానిక యువకుడు ఒకమ్మాయిని మాత్రమే రక్షించగలిగాడు. ఈ నేపథ్యంలోనే 'నో సెల్ఫీ జోన్'లను ప్రకటించాలని ఫడ్నవీస్ సర్కారు భావిస్తోంది. త్వరలో అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే తరహా జోన్లు వచ్చేస్తాయని భావించవచ్చేమో!