: ఉద్యోగుల పీఎఫ్ ను ఇకపై 15 రోజుల్లోనే జమ చేయాలి
ఉద్యోగుల భవిష్య నిధి (పీఎఫ్) డబ్బును సంబంధిత సంస్థల యాజమాన్యాలు ఇకపై 15 రోజుల్లోనే జమ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం అనుమతిస్తున్న 5 రోజుల గ్రేస్ పిరియడ్ ను కేంద్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలోని 'ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ' (ఈపీఎఫ్ఓ) తొలగించింది. ఈపీఎఫ్ఓ పరిధిలోని సంస్థలు ప్రతినెల తమ ఉద్యోగులు, కార్మికుల పీఎఫ్ డబ్బును 15 రోజుల్లోపు ఈపీఎఫ్ఓ వద్ద జమ చేసేవి. ఆలోగా సాధ్యం కాకపోతే మరో 5 రోజుల వెసులుబాటు కూడా ఉండేది. అంటే ఈ నెల పీఎఫ్ డబ్బును వచ్చే నెల 20వ తేేదీ లోపు చెల్లించేందుకు అవకాశం ఉండేది. కానీ ఈ ఐదు రోజుల సమయాన్ని తాజాగా తొలగిస్తూ ఈపీఎఫ్ఓ నిర్ణయం తీసుకుందని ఈపీఎఫ్ఓ హైదరాబాద్ రీజనల్ కమిషనర్ ఓ ప్రకటనలో తెలిపారు.