: టైమ్ టూ చేంజ్... మారనున్న మోదీ టీం!
ప్రధాని నరేంద్రమోదీ క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ త్వరలో జరిగే అవకాశాలున్నట్టు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ఇటీవలే పార్టీ అధ్యక్షుడిగా అమిత్ షా పదవీ కాలం ముగియడంతో, ఆయన్నే తిరిగి అధ్యక్ష పదవికి ఎన్నుకునే ప్రక్రియ ముగిసిన అనంతరం మోదీ తన టీంను మార్చడంపై దృష్టిని సారిస్తారని తెలుస్తోంది. ఈ సంవత్సరం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలను ఎదుర్కోవాల్సి వున్న మోదీ, వాటికి నోటిఫికేషన్ వచ్చే ముందే క్యాబినెట్ మార్పులు చేర్పులు చేస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రధాన మంత్రిత్వ శాఖలైన హోం, ఫైనాన్స్, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖల్లో మార్పుండదని, మిగతా శాఖల్లో తీసివేతలు తప్పవని వివరించారు. ఈ శాఖలు రాజ్ నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, మనోహర్ పారికర్, సుష్మా స్వరాజ్ చేతుల్లో ఉన్న సంగతి తెలిసిందే. "అమిత్ షా అద్భుత పనితీరును చూపారు. పార్టీ యావత్తూ ఆయనే అధ్యక్షుడిగా కొనసాగాలని భావిస్తోంది" అని బీజేపీ జనరల్ సెక్రటరీ కైలాష్ విజయ్ వర్గియా వివరించారు. కాగా, 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే క్యాబినెట్ మార్పులు జరుగుతాయని, అయోధ్యలో రామమందిరం పునర్నిర్మాణంపైనా ఆయన దృష్టి ఉందని తెలుస్తోంది. సుప్రీంకోర్టులో అయోధ్యపై జరుగుతున్న విచారణను వాయిదాలు లేకుండా రోజువారీ విచారించి త్వరగా తేల్చాలని కూడా కోరవచ్చని సమాచారం. ఈ విషయంలో సుబ్రహ్మణ్య స్వామి వంటి పార్టీ నేతలతో పాటు ఆర్ఎస్ఎస్ నేతల నుంచి ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. సాధ్యమైనంత త్వరగా రామమందిరం నిర్మిస్తే, ప్రజల్లో సెంటిమెంట్ నిలిచి మరోసారి అధికారాన్ని పొందవచ్చన్నది బీజేపీ భావనగా తెలుస్తోంది.