: మనవరాలి పెళ్లికి... మోదీతో పాటు దావూద్ ఇబ్రహీంకూ పాక్ ప్రధాని ఆహ్వానం!
గత నెల 25న పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ మనవరాలు మెహరూన్ నిసా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. లాహోర్ శివారు ప్రాంతం రాయ్ విండ్ లోని నవాజ్ సొంతింటిలో జరిగిన ఈ పెళ్లికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఆహ్వానం అందింది. దాయాదీ దేశ ప్రధాని అందించిన ఆహ్వానాన్ని మన్నించిన మోదీ, అఫ్ఘన్ రాజధాని కాబూల్ నుంచి ఢిల్లీ వస్తూ లాహోర్ లో దిగిపోయారు. విమానాశ్రయానికి వచ్చిన షరీఫ్, మోదీని వెంటబెట్టుకుని తన ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ కొత్త దంపతులను ఆశీర్వదించిన మోదీ, నవాజ్ తల్లికి పాదాభివందనం చేసి ఢిల్లీ వచ్చేశారు. ఆ మరునాడే భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కూడా నవాజ్ ఇంటిలో వాలిపోయారు. సకుటుంబ సమేతంగా షరీఫ్ ఇంటికి వెళ్లిన దావూద్, అక్కడ జరిగిన పెళ్లి సంబరాల్లో పాల్గొన్నాడు. షరీఫ్ ఆహ్వానం మేరకే దావూద్ అక్కడికి వెళ్లాడట. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే... దావూద్ అక్కడ ఉన్న సమయంలోనే భారత్ కు చెందిన ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త, ముంబై నుంచి తరలివెళ్లిన కొందరు భారతీయ ప్రముఖులు అక్కడ ఉన్నారట. ఈ మేరకు ‘ఐబీఎన్7’ నేటి ఉదయం సంచలన కథనాన్ని ప్రసారం చేసింది. ముంబైకి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బల్జీత్ పర్మార్ ను ఊటంకిస్తూ ప్రసారమైన ఆ కథనం పెను కలకలం రేపుతోంది. పెళ్లికి పిలవగానే శత్రు దేశంలో అడుగుపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ, సదరు పెళ్లికి ఎవరెవరకు హాజరవుతున్నారన్న విషయాన్ని కూడా పట్టించుకోలేదు. అంతేకాక మోదీ లాహోర్ పర్యటనకు వెళతాననగానే, ఆయన భద్రతా సిబ్బంది కూడా ముందూ వెనుకా చూసుకోకుండా తలాడించేశారన్న విమర్శలు రేకెత్తుతున్నాయి.