: "రజనీ సారేంటి? ఎవడు సూపర్ స్టార్" అంటూ సుహాసినిపై బాలకృష్ణ ఆగ్రహం... పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న 'డిక్టేటర్'!
"రజనీ సార్ వచ్చారట... బాలా! కిందకు వచ్చేయ్" అన్న సుహాసిని మాటలు నందమూరి బాలకృష్ణకు ఆగ్రహాన్ని తెప్పించాయంట. "రజనీ సారేంటి? ఎవడు సూపర్ స్టార్... ముందు ఫోటోలు తీయండి" అని సుహాసినిపై అంతెత్తున లేచారట బాలకృష్ణ. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. తాను నటించిన 'డిక్టేటర్' చిత్రం విడుదల సందర్భంగా ఓ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాలయ్య తన పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. 'క్రీమ్ ఆఫ్ ఎయిటీస్' పేరిట చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, మోహన్ లాల్, రజనీకాంత్ తదితర దక్షిణాది తారలంతా హోదాలు మరచిపోయి, ఏడాదికి ఒకసారి కలసి సరదాగా గడుపుతామని వెల్లడించిన ఆయన, అందరమూ గ్రూప్ ఫోటోలు దిగుతున్న వేళ ఈ విషయం జరిగిందని, పెద్ద పెద్ద విషయాలతో పోలిస్తే, చిన్న చిన్న విషయాలకే తనకు కోపం వస్తుందని తెలిపారు. తాను అన్నింటా పర్ఫెక్షన్ ను కోరుకుంటానని, చుట్టూ ఉన్న వాళ్లూ అలాగే ఉండాలని అనుకుంటానని, లేకుంటే మాత్రం ఆగ్రహం వచ్చేస్తుందని నవ్వుతూ చెప్పారు.