: ‘బాణం’ వద్దు...‘గుడిసె’ అయితే బాగుంటుంది!: పార్టీ గుర్తుపై ఈసీకి విన్నవించనున్న జేడీయూ
బీహార్ లో వరుసగా మూదో దఫా జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) అధికార పగ్గాలు చేపట్టింది. ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మొన్నటి ఎన్నికల బరిలోకి దిగిన ఆ పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఆవిర్భావం నుంచి ‘బాణం’ గుర్తుతోనే ఆ పార్టీ ఎన్నికల బరిలోకి దిగుతోంది. అయితే సదరు ‘బాణం’ బాగా లేదని ఆ పార్టీ భావిస్తోంది. ఎందుకంటే, ఇకపై ఒక్క బీహార్ కు మాత్రమే పరిమితం కావడానికి ఆ పార్టీ ఇష్టపడటం లేదు. ఇకపై దేశంలో ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ పోటీ చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలో జాతీయ పార్టీగా అవతరించనున్న తమకు... కొన్ని ప్రాంతీయ పార్టీలకు కూడా కేటాయించిన ‘బాణం’ గుర్తు కరెక్ట్ కాదని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆ పార్టీ ఈ మేరకు తీర్మానించింది. ‘బాణం’ గుర్తు స్థానంలో తమకు ‘గుడిసె’, ‘నాగలి ఎత్తుకున్న రైతు’ తదితర గుర్తుల్లో ఏదో ఒకటి కేటాయించాలని ఆ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరనుందట. త్వరలోనే అసోం, తమిళనాడు, పాండిచ్చేరి, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆ పార్టీ భావిస్తోందట. ఈ క్రమంలో గుర్తు మార్పు కోసం ఆ పార్టీ త్వరలోనే ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించనుంది.