: వాయిస్ శాంపిళ్లు, వేలి ముద్రలు ఇవ్వండి: పఠాన్ కోట్ దాడిపై భారత్ కు పాక్ లేఖ!
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదుల దాడికి సంబంధించి భారత్ అందించిన ఆధారాలు సరిపోవని పాకిస్థాన్ భావిస్తోంది. ఈ మేరకు ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు నాసిర్ ఖాన్ జంజువా భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు లేఖ రాయనున్నారు. పఠాన్ కోట్ ఉగ్రవాదులు పాక్ లోని తమ ఇళ్లతో పాటు దాడికి వ్యూహరచన చేసిన సూత్రధారులతో ఫోన్ లో మాట్లాడారని భావిస్తున్న నెంబర్లను భారత్ సేకరించింది. అవే ఆధారాలను పాక్ కు అందజేసింది. అయితే సదరు నెంబర్లు తమ దేశంలో రిజిస్టర్ కాలేదని పాక్ చెబుతోంది. అంతేకాక రిజిస్టర్ కాని నెంబర్లను ట్రేస్ చేయడం కూడా సాధ్యం కాదని తేల్చిచెప్పింది. ఈ క్రమంలో తమ భూభాగంపైనే పఠాన్ కోట్ దాడికి వ్యూహరచన జరిగిందని, సూత్రధారులు కూడా పాక్ లోనే ఉన్నారన్న విషయంపై దర్యాప్తు జరుపుతున్న తమకు మరిన్ని ఆధారాలు కావాలని జంజువా త్వరలోనే దోవల్ కు లేఖ రాయనున్నారట. ఉగ్రవాదులు మాట్లాడారని భావిస్తున్న ఫోన్ వాయిస్ రికార్డులతో పాటు, దాడిలో చనిపోయిన ఉగ్రవాదులకు సంబంధించిన వేలి ముద్రలను కూడా అందజేయాలని జంజువా కోరనున్నట్లు తెలుస్తోంది. మరిన్ని కీలక ఆధారాలు అందజేస్తేనే కాని, తమ దర్యాప్తు ముందుకు సాగదని కూడా జంజువా సదరు లేఖలో భారత్ కు తేల్చిచెప్పనున్నట్లు విశ్వసనీయ సమాచారం.