: ‘నాన్నకు ప్రేమతో’పై జనగామ కోర్టులో ప్రైవేటు కేసు!
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘నాన్నకు ప్రేమతో’ చిత్రం పోస్టర్లు తమ మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ మైనార్టీ యువజన సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వరంగల్ జిల్లా జనగామ కోర్టులో ప్రైవేటు కేసు వేశారు. ఈ సందర్భంగా మైనార్టీ యువజన నాయకులు ఎండి ఎజాజ్, అన్వర్, సమ్మద్, హబీబ్ తదితరులు మాట్లాడుతూ, అల్లా, మహ్మద్ ప్రవక్త, మహ్మద్ అనే పేర్లపై నటీనటులు డ్యాన్స్ చేస్తున్నట్లు ప్రచురించిన వాల్ పోస్టర్లు ముస్లింల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని ఆరోపించారు. ఈ చిత్ర దర్శకనిర్మాతలు సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్, హీరోహీరోయిన్ లు జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, కెమెరామేన్ విజయ్ చక్రవర్తిపై మైనార్టీ యువజన సంఘాల నాయకులు ఫిర్యాదు చేశారు. కాగా, ఇదే విషయమై హైదాబాద్ లో ఇటీవల నిరసనలు వ్యక్తం చేశారు. ముస్లిం యువకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. మాసబ్ ట్యాంకులోని సెన్సార్ బోర్డ్ కార్యాలయానికి వెళ్లి ఈ మేరకు వారు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.