: రవన్న కుటుంబసభ్యుడిగానే నన్ను భావిస్తారు: వివేక్ ఒబెరాయ్
'రక్త చరిత్ర' చిత్రంలో నటించినప్పటి నుంచి రవన్న (పరిటాల రవి) కుటుంబంతో తనకు భావోద్వేగ సంబంధాలు ఉన్నాయని, వాళ్లు తనను కుటుంబసభ్యుడిగానే భావిస్తారని బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ అన్నారు. అనంతపురం జిల్లాలోని ముత్తవకుంట గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. ఈరోజు ఆ గ్రామంలో పర్యటించిన వివేక్ ఒబెరాయ్ విలేకరులతో మాట్లాడుతూ, పరిటాల రవి కుటుంబంపై ఉన్న అభిమానంతోనే ఈ గ్రామాన్ని తాను దత్తత తీసుకున్నానన్నారు. ఇక్కడకు రావడం తనకు చాలా ఆనందంగా ఉందని, ఈ గ్రామాన్ని ఆకర్షణీయ గ్రామంగా తీర్చిదిద్దాలన్నదే తమ ఆశయమని చెప్పారు. గతంలో తాను అనంతపురం వచ్చానని, స్వచ్ఛంద సంస్థ ద్వారా 15 ఏళ్లుగా దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ఉచిత పాఠశాలలు నడుపుతున్నామని దీని ద్వారా మూడు వేల మంది బాలికలకు ఉచిత విద్యను అందిస్తున్నట్లు వివేక్ ఒబెరాయ్ చెప్పారు.