: పోలీసులు విడుదల చేసిన తన ఫోటో నచ్చలేదని సెల్పీ పంపిన రౌడీ షీటర్
'మోస్ట్ వాంటెడ్' అంటూ పోలీసులు విడుదల చేసిన నోటీసులో తన ఫోటో నచ్చలేదని ఓ రౌడీ షీటర్ కొత్తగా సెల్పీదిగి పోలీసులకు పంపిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. అమెరికాలో డొనాల్డ్ అనే వ్యక్తిపై దోపిడీ, దొమ్మీలు వంటి ఎన్నో అరోపణలు ఉన్నాయి. దీంతో అతని కోసం గాలించిన పోలీసులు ఎంతకీ చిక్కకపోవడంతో విసిగివేసారిపోయారు. దీంతో 'వాంటెడ్' అని, అతని ఆచూకీ తెలిస్తే చెప్పాలంటూ పోలీసులు తమ వెబ్ సైట్ లో నోటీసు పెట్టారు. దీనిలో పోలీసులు పెట్టిన ఫోటోలో కళ్లు ఎర్రగా, ముఖం నిర్జీవంగా ఉండడం సదరు డొనాల్డ్ గారికి నచ్చలేదు. దీంతో వెంటనే సూటూబూటు కళ్లజోడు ధరించి, లేటెస్ట్ సెల్పీని పోలీసులకు పోస్టు చేసి, నోటీసులో ఈ ఫోటో వాడాలని సూచించాడు. దీనిపై స్పందించిన పోలీసులు, లేటెస్ట్ ఫోటో పెట్టి డొనాల్డ్ మంచి పని చేశాడని, అలాగే పోలీసుల ముందుకు వచ్చి, ఆయనపై ఉన్న ఆరోపణలపై కూడా వివరణ ఇస్తే మరింత బాగుంటుందని వారు సూచించారు.